తెలుగు పాటను పాడుకొందాం! తెలుగు మాటను కాపాడుకొందాం!               తెలుగు లోనే మాట్లాడదాం! తెలుగు కోసం కొట్లాడదాం!               ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి చేతలు తలపెట్టవోయ్!

మనం చేయాల్సిన పనులు

మనం సొంతగా చేయాల్సిన పనులు

మీ ఊళ్ళో మీరు ఒక్కరిగానో, ఇద్దరిగానో ఉంటే ఇంకొంత మందిని తెలుగు తల్లి సేవకు ముందుకు వచ్చేట్లు ఒప్పించాలి. ముగ్గురు అవగానే తెలుగు కూటమి/దండుని ఏర్పరచాలి. మీ పరిస్థితులను బట్టి వేరే పేరు పెట్టుకున్నా ఫరవాలేదు.

1. తెలుగు కూటమి/దండు ప్రతి నెల మొదటి ప్రభుత్వ సెలవునాడో, చివరి శనివారం లేక మొదటి ఆదివారం అనో ఒక ముందే నిర్ణయించుకున్న దినాన తప్పక కలవాలి. జరిగిన పని మీద సమీక్ష ఉండాలి. కొత్త పనులకు ప్రణాళిక వేయాలి. ప్రతి సభ్యుడు ప్రతి నెల ముఖ్యమంత్రి/తెలుగు భాష మంత్రికి తెలుగు కోసం చేయాల్సిన పనులను వక్కాణిస్తూ పోస్ట్ కార్డును రాయాలి. ఇమెయిల్, change.org, ముఖ్యమంత్రి డాష్ బోర్డులను కూడా ఇందుకు వాడాలి.

2. అన్ని పేరుపలకలలో తెలుగు ప్రముఖంగా ఉండాలని రెండు ప్రభుత్వాలు స్పష్టమైన ఉత్తర్వులను ఇచ్చాయి. అలా లేని చోట మనము అంగడి యజమానిని కలిసి చెప్పాలి. మన సంస్కృతిని చంపాలి అనుకునే ఆ కొట్టును బహిష్కరించమని వాడకందారులను కోరాలి. తెలుగు లేని పేరు పలక ఫోటోను తీసి సంబంధించిన అధికారికి ఫిర్యాదును ఇచ్చి రసీదు తీసుకోవాలి. అతను చర్య తీసుకోకుంటే పై అధికారికి, అవినీతి నిరోధక శాఖకు అతనిపై ఫిర్యాదును ఇవ్వాలి.

3. పత్రికలు, టి.వి., సినిమా బాధ్యులను కలవాలి. తెలుగుతో పాటు వారి బ్రతుకుతెరువు కూడ ఇబ్బందులలో పడుతుంది అన్న సంగతిని వారికి గుర్తుచేయాలి. సరైన తెలుగును వాడి మిగిలిన వారికి మంచి దారిని చూపించాలని కోరాలి. ఉద్యమ వార్తలు, వ్యాసాలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి అని చెప్పాలి.

4. మన పిల్లకు తెలుగు ఆటలు, పాటలు, కళలు నేర్పాలి; మన కార్యక్రమాలలో అవి కనపడాలి. అన్ని ప్రాంతాలవారు ముందు తరాలకు తమ మాటలను, పదసంపదను అందించాలి.

5. బ్యాంకులకు వెళ్ళాలి. శాఖాధికారికి చెప్పాలి, “మీ లక్నో శాఖలో ఖాతా తెరిచే కాగితాలను హిందీలో ఇస్తారు. మంగుళూరులో డబ్బులు జమ చేసే కాగితాలను కన్నడంలో ఇస్తారు. (కర్ణాటకలో రైలు టికెట్లు కూడ కన్నడ భాషలో ఉండేట్లు వారు విజయవంతమైన ఉద్యమాన్ని నడిపారు.) మదురైలో డి.డి. అప్లికేషను కాగితాన్ని తమిళంలో ఇస్తారు. నీకేం రోగం వచ్చింది? విజయవాడలో ఉండి తెలుగులో ఒక్క కాగితం కూడ ఇవ్వటం లేదేమి? వారం రోజుల్లో కాగితాలు తెలుగులో ఉండకపోతే గేటుకు అడ్డంగా నిలబడి తెలుగుద్రోహపు బాంకుకు మీరు దూరంగా ఉండమని వాడుకరులను అడిగి నీ శాఖ మూతబడేట్లు చేస్తాం”. ఇలా పది చోట్ల జనం కదిలితే పరిస్థితిలో మార్పు రాదా? అలానే మిగిలిన బ్యాంకులు కూడ.

6. రోడ్డు రవాణా సంస్థ, విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళాలి. ప్రభుత్వ ఆదేశం 218 తే. 22-3-1990 మేరకు మీ రాతపోతలన్నీ తెలుగులోనే ఉండాలి. పెద్దగా చదువురాని డ్రైవర్ కు, హెల్పర్కు, మీరు ట్రాన్సఫర్ లేక పని ఆదేశాలను ఆంగ్లంలో ఎందుకు ఇస్తున్నారు? అని అడగాలి. చట్టరీత్యా ఇది నేరం.

7. ఉద్యమంలోనికి నిరంతరం కొత్తవారిని చేర్చటం అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉండాలి.

8. ప్రతి సాహిత్య సమావేశానికి వెళ్లి చివరగా తెలుగు కోసం ప్రభుత్వం చేయవలిసిన పనులను వివరిస్తూ ఒక తీర్మానాన్ని అందుకోసం చేయించాలి. ఉద్యమ నినాదాలివ్వాలి. సంతకాలు పెట్టించి ప్రభుత్వానికి, పత్రికలకు పంపాలి. తెలుగు ప్రేమికులు వట్టి సాహిత్యానికే పరిమితం అయితే చాలు అనే భ్రమ కొంత మంది అంటున్నట్లు మత్తు మందుగ పనిజేసి ఉద్యమ బాట నుంచి పక్క బాట పట్టిస్తుంది. భ్రమను వీడండి.

9. తల్లిదండ్రులు తమ పిల్లలు ఆంగ్లం మాధ్యమంలో చదవాలి అని కోరుకుంటున్నారు. అందుకని మేము కూడ ఆంగ్ల మాధ్యమం బడులను పెట్టవలసి వస్తున్నది అని ప్రభుత్వం అంటున్నది. అందుకని మనం వీలైనంత మంది తల్లిదండ్రులను కలవాలి. తెలుగులో చదివితేనే పిల్లలు రాణిస్తారు అన్న విషయాన్ని వారికి తెలిసేట్లు చెప్పాలి. బడులలో పెట్టే తల్లుల సమావేశాలకు మనము వెళ్ళాలి. డా. మిత్ర గారు ౧౦ పుటలలో చిన్న పొత్తాన్ని రాస్తామన్నారు ఈ విషయమై తల్లులకు సరిగా నచ్చచెప్పటానికి. అటువంటి ఇంకొన్ని పుస్తకాలను తేవాలి.

10. రచయిత/రచయిత్రులను కలవాలి. “మీరు రాసిన పుస్తకం ఎవరూ, మీ మనమడితో సహా చదువరు అని మీకు తెలుసు. అందుకనే 500 ప్రతులనే వేస్తారు. ఒక 50 ప్రతులను మీకు తెలిసిన వారికి ఊరకనే ఇస్తారు. మిగిలిన 450 పుస్తకాలు మీరు ఉన్నంత కాలం మీ ఇంట్లో ఉంటాయి. వాటిని దులపలేక, సర్దలేక ఇంటివారు మిమ్ములను తిడుతూనే ఉంటారు. తెలుగు వారు 18 కోట్ల మంది ఉన్నా మనకు ఈ గతి పట్టింది. కాని 3 కోట్ల మందే ఉన్న మలయాళీలు ప్రతి రచయిత 10,000 ప్రతులకు తక్కువ వేయకుండ చూస్తారు. వాటిని కొంటారు. ఇక్కడ బడిలో తెలుగు లేదు కాబట్టి మీ పుస్తకాలను కొనే వారు దొరకరు. అందుకని మీరు కూడ కొంతకాలం కలాన్ని పక్కన పెట్టి కాలు జాడించి భాషోద్యమంలోకి కదలాలి.” అని చెప్పాలి.

11. ముందు మనం మారాలి. మారిన మనిషిగ కుటుంబంలోని మిగిలిన వారికి, మన నేస్తాలకు, తెలిసిన వారికి చాల స్పష్టంగ కనపడాలి. మనం మాట్లాడేటప్పుడు వీలున్నంత వరకు తెలుగు మాటలనే వాడాలి; ఇంగ్లిష్, సంస్కృతం, హిందీలాంటి పెర నుడుల మాటలను క్రమంగ వదిలెయ్యాలి. తెలుగు పరిపుష్టమైన భాషే అన్న అభిప్రాయాన్ని మనం పెంపొందించాలి. సమావేశాలలో, కార్యాలయాలలో, ఇతర చోట్ల మన పేరు, చిరునామాలను తెలుగులోనే రాయాలి. అన్ని చోట్లా, బ్యాంకులతో సహా మీ సంతకాలను తెలుగు లోనే పెట్టాలి. మీ చేపలుకు (cell phone) వెరసును తెలుగులోనే చెప్పాలి.

12. వాట్సాప్, టెలిగ్రాం, ఇమెయిల్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి కొత్త సాంఘిక మాధ్యమాల్లో చురుకుగా పాల్గొని ఉద్యమ సందేశాన్ని పెద్దగా ప్రచారం చేయాలి. తెలుగు కూటమి పోటీలను చూడండి.

13. విశ్వ విద్యాలయాలు, కళాశాలల అధికారులను కలవాలి.

14. ప్రతి పల్లెటూరులోను తెలుగు పంతుళ్ళు ఉన్నారు. అంటే సహజంగానే మారు మూల ప్రాంతాల్లో కూడ మన సైనికులున్నారు. మన ఉద్యమానికి మిగిలిన కార్యకర్తలకు కేంద్ర బిందువుగ వీరిని కదిలించాలి. బడులలో తెలుగు పోతే వారి జాతే అంతరించి పోతుంది అన్న విషయాన్ని వారికి వివరించాలి.

15. పత్రికలలో మన వ్యాసాలు, ఉత్తరాలు క్రమం తప్పకుండ కనపడాలి. తెలుగు తల్లి కోసం సమాజం గళమెత్తినది అన్న సందేశం స్పష్టంగ కనపడాలి.

16. తెలుగును పెంపొందించాలి అన్న మంచి ఆశయంతో చాలా సంస్థలు తాము ఎన్నుకొన్న సందర్భాలలో కవితలు, కతలు, నవలలు, వగైరా పోటీలు పెడుతుంటారు. భాషోద్యమం పోటీల వైపు మారాల్సిన అవసరాన్ని వారికి తెలియజేయాలి.

17. ముందుగ తెలుగును ఒక విషయంగ కూడ చెప్పని బడుల మీద ఫిర్యాదు చేయాలి, వ్యాజ్యాలు వేయాలి. తెలుగు కూటమి పోటీలను చూడండి.

18. ఉత్తేజపరిచి ఉరికించే ఉద్యమనినాదాలను తయారు చేయాలి. పాటలు రాయాలి, పాడించి సాంఘిక మాధ్యమాలలో పెద్దగ ప్రచారానికి పెట్టాలి. తెలుగు కూటమి పోటీలను చూడండి.

19. రాజకీయ నాయకులను, అందునా ప్రతిపక్ష నాయకులను కూడ తప్పక కలవాలి. అన్ని పార్టీల వారు మన ఉద్యమాన్ని సమర్థిస్తేనే అడ్డంకులు తగ్గిపోతాయి.

20. మన ప్రాంతానికి వస్తున్న అధికారులు, సంఘాల సంస్థల నాయకులు, ప్రసంగీకులు, అధికార ప్రతిపక్ష నాయకులను కలవాలి. తెలుగు వాడకం మీద ఒప్పించి వారి ప్రకటన కాగితాలను తీసుకోవాలి. వాటిని ప్రసార మాధ్యమాలకు ఇవ్వాలి.

21. మన కోర్కెలలో చాలా వాటిని అమలు చేయటానికి ప్రభుత్వానికి అయ్యే అదనపు ఖర్చు కూడ ఉండదు. ఈ విషయాన్ని వారి దృష్టికి తెచ్చి ముందుగ వాటిని అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అని తెలపాలి.

22. జిల్లా న్యాయమూర్తిని కలిసి మీరే చట్టాలకి వ్యతిరేకంగా పని జేస్తే ఎలా అని అడగాలి. తీర్పులు, పాలన తెలుగులోనే ఉండాలని ఉన్న స్పష్టమైన ఆదేశాలను ఎందుకు పాటించటం లేదు అని అడగాలి. 170 ఏండ్లక్రితమే బ్రౌన్ దొర తెలుగులో తీర్పులు ఇచ్చాడు. (తెలుగు కూటమి పోటీలను చూడండి.)

23. మన మనస్సుల్లో స్పష్టత ఉండాలి: కోరికలు, తీర్మానాలు, మహజర్ల దశ నుంచి మనం రోడ్డు మీదకు రావాలి.

ఏలికలను అడగాల్సిన పనులు

మన ఉద్యమం ఒక ఎత్తు; ప్రభుత్వ ప్రమేయం ఒక ఎత్తు. కొన్ని పనులు ప్రభుత్వం మాత్రమే చేయాల్సి వుంటుంది. ప్రభుత్వ సహకారం లేకుండ మన భాష, సంస్కృతి, కళలు వన్నెకెక్కవు. అందుకని అన్ని రంగాల నుంచి ప్రభుత్వం మీదకు ఒత్తిడి తేవాలి.

1. అధికారంలో ఉన్న ప్రతి పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో తెలుగు భాష, సంస్కృతుల కోసం చేయబోయే కార్యక్రమాలను ప్రకటిస్తుంది. దాని ప్రతులను మన దగ్గర ఉంచుకోవాలి. మంత్రులను, శాసన సభ్యులను కలిసినప్పుడల్లా వారికి ఒక ప్రతిని ఇవ్వాలి. ముందు డబ్బులు అవసరమే లేని పనులనైనా ఎందుకు చేయలేదని అడగాలి. ప్రజలు మీ మీద విశ్వాసాన్ని కోల్పోతున్నారని తెలియజేయాలి.

2. నూతన విద్యావిధానం-2022 సూచించినట్టు అన్ని బడులలో (ఏలినవారివి, ఇతరులవి) కనీసం 8వ తరగతి వరకు బడి మాధ్యమభాషగా తెలుగు ఉండాలి.

3. స్నాతక దశ రెండవ ఏటి వరకు తెలుగును ఒక విషయంగా నేర్పాలి. వైద్యుడు రాసినది తెలియక మందులు తప్పుగా వేసుకొని రోగి చనిపోయాడని అతని చుట్టాలు విశాఖలోని ఆ వైద్యుడిని చంపినంత పని చేశారు. ఒకసారి భాషోద్యమ సభలో మాట్లాడుతూ బి. వి. రాఘవులు గారు చైనాలో రైతులు ఆత్మహత్య చేసుకొనక పోవటానికి కారణం అక్కడ శాస్త్ర పరిశోధనలలో మంది నుడి ఉండటమే కారణం అన్నారు. మన దగ్గర నేలలు, పంటలు, బలం మందులు, పురుగు మందుల మీద పరిశోధనలు తెలుగులో జరగవు, వెలువడవు. అవి రైతుల దగ్గరికి చేరేసరికి పనికి రాని పాత పరిశోధనలు అవుతాయి.

4. కేంద్రీయ పాఠశాలలైనా సరే తప్పక ఒక విషయంగ తెలుగును నేర్పాలి అని 2003 లో ఇచ్చిన ప్రభుత్వ ఆదేశం సం. 86 స్పష్టం చేస్తున్నది. దాన్ని ఆచరించి తమ నిజాయితీని నిరూపించుకోమనాలి.

5. తెలుగు ప్రాధికార సంస్థను వెంబడే ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటుచేసిన సంస్థలో వెంబడే తగు సభ్యులను నియమించాలి. ఈ సంస్థ లేకపోవటం వలన మనం వెళ్లి ఎవరితో మన సమస్యలను చెప్పుకోవాలో, తరువాత వెంబడపడాలో తెలియటం లేదు.

6. ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థల ఉద్యోగుల నియామక పరీక్షలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా పెట్టాలి. క్లీనర్, హెల్పర్ పరీక్షలకు పదవ తరగతి కనీస అర్హత అయితే పదవ తరగతి వరకు తెలుగును విడువక చదివితేనే పాస్ అయ్యేటట్లు పరీక్ష పత్రం ఉండాలి. డి. ఎస్. పి. పదవికి గ్రాడ్యుఏషన్ కనీస అర్హత అయితే అంత వరకు తెలుగును విడువక చదివితేనే దాటేట్లు పరీక్ష స్థాయి ఉండాలి. కొంతమంది తెలియక తెలుగు మాధ్యమం వారికి 10% అదనపు మార్కులు ఉండాలని అడుగుతారు. ఇంతకు ముందు అటువంటి నియమం న్యాయస్థానంలో కొట్టివేయబడింది. కొంత మంది తెలుగు మాధ్యమం వారికి 20% రిజర్వేషన్ ఉండాలి అని అడుగుతారు. అది కూడ న్యాయస్థానంలో కొట్టివేయబడుతుంది. పైగా ఏ మాత్రం తెలుగు రానివారికి 80% రిజర్వేషన్ ఇచ్చినట్లు అవుతుంది. అందువల్ల తెలుగు పరిస్థితి ఇంకా చెడిపోతుంది.

7. తెలుగును అధికార, శాసన, న్యాయస్థాన భాషగా వాడాలని పట్టుబట్టాలి.

8. అన్ని బడులలో (ఏలినవారివి, ఇతరులవి) తప్పక తెలుగు శిక్షణ పొందిన తెలుగు పంతుళ్ళను నియమించాలి.

9. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పనిని ఇక్కడ కూడ చేయాలి: మన భాషను ఇప్పటి శాస్త్ర, వైద్య, సాంకేతిక అవసరాలను తీర్చగల భాషగ తీర్చి దిద్దాలి.

10. పేరు పలకల మీద తెలుగు వాడకంపై అధికారుల నుంచి నెలలవారీ రిపోర్టులు తెప్పించాలి.

11. బయటి రాష్ట్రాలలో, దేశాలలో తెలుగును నేర్పటానికి ఏర్పాట్లు కావాలి. అక్కడ రెండవ అధికార భాషగా తెలుగు కోసం పట్టుబట్టాలి. 9% మహమ్మదీయులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉర్దూను అధికార భాషగా గుర్తించాం. 3% మంది తమిళులు ఉన్న సింగపూరులో తమిళం అధికార భాషగా గుర్తింపు పొందింది. 40% మందిగా తెలుగువారు ఉన్నా తమిళనాట తెలుగుకు అధికార భాష హోదా లేదు.

12. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న తెలుగు పురావస్తు సామగ్రిని సేకరించాలి. ముందుగ అక్కడ ఉన్నప్పుడే డిజిటలైజ్ చేయాలి. తమిళనాడులో అటువంటి సామగ్రిని నాశనం చేస్తున్నారు. అడిగితే మీరు తీసుకొని పొండి అని అంటున్నారు. ఈ పనిని యుద్ధ ప్రాతిపదికన చేయాలి. ఇంకే మాత్రం జాగుచేయరాదు. బుద్ధప్రసాద్ గారు ఇచ్చిన రిపోర్టు మీద వెంబడే చర్య తీసుకోవాలి.

13. అలాగే తెలుగు సంస్కృతి, జానపద కళలు, ఆటల వివరాలను సేకరించాలి. డిజిటలైజ్ చేయాలి.

14. తెలుగు పరిశోధక విద్యార్థులను అంతటా తిప్పి మారుమూలల్లో మామూలు మనుషులు వాడుతున్న తెలుగు మాటలను సేకరించాలి. తెలుగు పాఠ్యపుస్తకాలలో వాటిని వాడాలి. అన్నమయ్య వాడిన మాటలు తెలియని పరిస్థితి ఏర్పడుతున్నదని రవ్వా శ్రీహరి గారు వాపోతున్నారు.

15. కొత్త మాటల అవసరం ప్రతి రోజూ వస్తూనే ఉంటుంది. తమిళనాడులో ఉన్నట్లుగ దీనికి ఒక ఏర్పాటు ఉండాలి. తెలుగు మూలాల నుంచి మనం మాటలను పుట్టించుకోకపోతే తెలుగు పనికి రాని భాష అని మనం అనుకుంటున్నట్లు భావించాల్సి వస్తుంది.

16. తెలుగు వాచకాలలో తెలుగు మాటలను నేర్పాలి. తెలుగు పాఠాలను కొంతగానైన ఉంచాలి. ఇప్పుడు ఇల్లు, బజారు, పొలం దగ్గర మాత్రమే పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు. బడిలో సంస్కురుతం మాటలు మాత్రమే నేర్పుతున్నారు.

17. కంప్యూటర్, ఫోన్, అంతర్జాల భాషగ తెలుగును పెంపొందించాలి. ఇతర రాష్ట్రాల్లో అక్కడి భాషే వినపడుతుంది ఫోన్లలో. తెలుగు పుస్తకాలు ఇంకా అను రాజోక (ఫాంట్) లోనే అచ్చు అవుతున్నాయి. అందువల్ల వీటిని కంప్యూటర్లలో సెర్చ్ ఇంజన్ పట్టుకోలేదు. కాబట్టి తరువాతి తరాలకు ఈ పొత్తాలు కనపడవు. ఇతర భాషలకు ఈ ఇబ్బంది లేదు. అందుకని తెలుగులో మంచి రాజోకలను, పేజిమేకర్ను ప్రభుత్వం చేయించాలి.

18. బ్యాంకులు, అటువంటి ఇతర సంస్థలలో తెలుగు వాడకానికి పట్టుబట్టాలి.

19. వలగూడులో (ఇంటర్నెట్) నిరంతరం పెంచుతున్న వాగమిని (dictionary) ప్రభుత్వం చేపట్టాలి. అది అందరికి అందుబాటులో వుండాలి. మంది ఇస్తున్న సూచనలను ఒక సంఘం పరికిస్తూ సరిఅయిన మార్పులను చేస్తుండాలి.

20. అంగన్ వాడి నుంచే పనికి రాని భాష తెలుగు అని ప్రభుత్వం చెప్పటం మానివేయాలి.

21. అన్ని తెలుగు పత్రికలు, పుస్తకాలు దొరికే, దాచే వలగూడు ఉండాలి. కూచిభొట్ల ఆనంద్ గారు దీనికి కొంత ప్రయత్నం చేస్తున్నారు కాని ఈ పనిని ప్రభుత్వం చేయాలి.