ఎందుకు ఉండాలి?
తెలుగువాళ్ళం కాబట్టి మన పేరు తెలుగులో ఉండాలి. పెట్టుకోవచ్చు. కంప్యూటర్లు వచ్చిన కొత్తలో తెలుగు టైపుచేయలేక లేదా చూపించడలో ఇబ్బందుల వల్లను, ఆంగ్లంలో పెట్టుకోవడం గతయ్యింది. కానీ, గత పదేండ్లుగా కంప్యూటర్లలో తెలుగు చూడటానికి, టైపు చేయడానికి ఉన్న సాంకేతిక ఇబ్బందులు తీరిపోయాయి. ఇంకా ఆంగ్లాన్ని పట్టుకొని వేలాడటం ఎందుకు?
తెలుగు భాషాభిమానులు, తెలుగు ఉద్యమకారులు, తెలుగు కూటమి సభ్యులు తెలుగును అన్నిటా ముందుకు తీసుకువెళ్తున్నారు. గూగుల్ ఖాతాలో వారి పేరు తెలుగులో పెట్టుకుంటే, వారి ఆశయాన్ని అది ప్రతిబింబిస్తుంది.
ఎలా పెట్టుకోవాలి?
గూగుల్ ఖాతాలో మన పేరు వ్రాసేచోట తెలుగులో టైపు చేస్తే సరిపోతుంది. (ఈ లంకెపై నొక్కి) గూగుల్ ఖాతా అమరికలలో పేరు సంబంధిత పేజీకి వెళ్ళండి. (ఒకవేళ మీ ఖాతా లోనికి ప్రవేశించి లేకపోతే, ప్రవేశించడానికి మీ ఖాతా దాటుమాటను అడుగుతుంది, మీరు మీరేనా అని తనిఖీ చేసుకుంటుంది.)
ఆ పేజీలో “ఆఖరి పేరు” అని ఉన్నచోట మీ ఇంటిపేరును తెలుగులో ఇవ్వండి. “మొదటి పేరు” అని ఉన్న చోట మీ పేరును తెలుగులో వ్రాయండి.
తర్వాత ఆ పేజీలో అడుగున ఉన్న “సేవ్ చేయి” అనే బొత్తాన్ని నొక్కండి.
అంతే!
మీరు ఇతర భాషీయులతో కూడా తరచూ ఈమెయిలు ద్వారా వ్యవహరిస్తూంటే, మీ పేరును తెలుగు, ఆంగ్లంలో కూడా పెట్టుకోవచ్చు. ఉదాహరణకు, “రవీంద్రనాథ్ (Ravindranath)” అని రెండు భాషలలోను పెట్టుకోవచ్చు.
ఇలానే, ఇతర సామాజిక మాధ్యమాలలో కూడా మన పేర్లు తెలుగులో పెట్టుకోవచ్చు. ఆయా సామాజిక మాధ్యమ జాలగూళ్ళలో ప్రొఫైలు పేజీకి వెళ్ళి మీ పేరును తెలుగులో పెట్టుకోవచ్చు.
One reply on “మీ గూగుల్ ఖాతా పేరు తెలుగులో ఉందా?”
మన తెలుగు భాష జాతి ఇప్పుడే స్పృహలోకి వచ్చింది