తెలుగు పాటను పాడుకొందాం! తెలుగు మాటను కాపాడుకొందాం!               తెలుగు లోనే మాట్లాడదాం! తెలుగు కోసం కొట్లాడదాం!               ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి చేతలు తలపెట్టవోయ్!

ఏలికలను ఏమి అడగాలి?

మన ఉద్యమం ఒక ఎత్తు; ప్రభుత్వ ప్రమేయం ఒక ఎత్తు. కొన్ని పనులు ప్రభుత్వం మాత్రమే చేయాల్సి వుంటుంది. ప్రభుత్వ సహకారం లేకుండ మన భాష, సంస్కృతి, కళలు వన్నెకెక్కవు. అందుకని అన్ని రంగాల నుంచి ప్రభుత్వం మీదకు ఒత్తిడి తేవాలి.

1. అధికారంలో ఉన్న ప్రతి పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో తెలుగు భాష, సంస్కృతుల కోసం చేయబోయే కార్యక్రమాలను ప్రకటిస్తుంది. దాని ప్రతులను మన దగ్గర ఉంచుకోవాలి. మంత్రులను, శాసన సభ్యులను కలిసినప్పుడల్లా వారికి ఒక ప్రతిని ఇవ్వాలి. ముందు డబ్బులు అవసరమే లేని పనులనైనా ఎందుకు చేయలేదని అడగాలి. ప్రజలు మీ మీద విశ్వాసాన్ని కోల్పోతున్నారని తెలియజేయాలి.

2. నూతన విద్యావిధానం-2022 సూచించినట్టు అన్ని బడులలో (ఏలినవారివి, ఇతరులవి) కనీసం 8వ తరగతి వరకు బడి మాధ్యమభాషగా తెలుగు ఉండాలి.

3. స్నాతక దశ రెండవ ఏటి వరకు తెలుగును ఒక విషయంగా నేర్పాలి. వైద్యుడు రాసినది తెలియక మందులు తప్పుగా వేసుకొని రోగి చనిపోయాడని అతని చుట్టాలు విశాఖలోని ఆ వైద్యుడిని చంపినంత పని చేశారు. ఒకసారి భాషోద్యమ సభలో మాట్లాడుతూ బి. వి. రాఘవులు గారు చైనాలో రైతులు ఆత్మహత్య చేసుకొనక పోవటానికి కారణం అక్కడ శాస్త్ర పరిశోధనలలో మంది నుడి ఉండటమే కారణం అన్నారు. మన దగ్గర నేలలు, పంటలు, బలం మందులు, పురుగు మందుల మీద పరిశోధనలు తెలుగులో జరగవు, వెలువడవు. అవి రైతుల దగ్గరికి చేరేసరికి పనికి రాని పాత పరిశోధనలు అవుతాయి.

4. కేంద్రీయ పాఠశాలలైనా సరే తప్పక ఒక విషయంగ తెలుగును నేర్పాలి అని 2003 లో ఇచ్చిన ప్రభుత్వ ఆదేశం సం. 86 స్పష్టం చేస్తున్నది. దాన్ని ఆచరించి తమ నిజాయితీని నిరూపించుకోమనాలి.

5. తెలుగు ప్రాధికార సంస్థను వెంబడే ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటుచేసిన సంస్థలో వెంబడే తగు సభ్యులను నియమించాలి. ఈ సంస్థ లేకపోవటం వలన మనం వెళ్లి ఎవరితో మన సమస్యలను చెప్పుకోవాలో, తరువాత వెంబడపడాలో తెలియటం లేదు.

6. ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థల ఉద్యోగుల నియామక పరీక్షలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా పెట్టాలి. క్లీనర్, హెల్పర్ పరీక్షలకు పదవ తరగతి కనీస అర్హత అయితే పదవ తరగతి వరకు తెలుగును విడువక చదివితేనే పాస్ అయ్యేటట్లు పరీక్ష పత్రం ఉండాలి. డి. ఎస్. పి. పదవికి గ్రాడ్యుఏషన్ కనీస అర్హత అయితే అంత వరకు తెలుగును విడువక చదివితేనే దాటేట్లు పరీక్ష స్థాయి ఉండాలి. కొంతమంది తెలియక తెలుగు మాధ్యమం వారికి 10% అదనపు మార్కులు ఉండాలని అడుగుతారు. ఇంతకు ముందు అటువంటి నియమం న్యాయస్థానంలో కొట్టివేయబడింది. కొంత మంది తెలుగు మాధ్యమం వారికి 20% రిజర్వేషన్ ఉండాలి అని అడుగుతారు. అది కూడ న్యాయస్థానంలో కొట్టివేయబడుతుంది. పైగా ఏ మాత్రం తెలుగు రానివారికి 80% రిజర్వేషన్ ఇచ్చినట్లు అవుతుంది. అందువల్ల తెలుగు పరిస్థితి ఇంకా చెడిపోతుంది.

7. తెలుగును అధికార, శాసన, న్యాయస్థాన భాషగా వాడాలని పట్టుబట్టాలి.

8. అన్ని బడులలో (ఏలినవారివి, ఇతరులవి) తప్పక తెలుగు శిక్షణ పొందిన తెలుగు పంతుళ్ళను నియమించాలి.

9. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పనిని ఇక్కడ కూడ చేయాలి: మన భాషను ఇప్పటి శాస్త్ర, వైద్య, సాంకేతిక అవసరాలను తీర్చగల భాషగ తీర్చి దిద్దాలి.

10. పేరు పలకల మీద తెలుగు వాడకంపై అధికారుల నుంచి నెలలవారీ రిపోర్టులు తెప్పించాలి.

11. బయటి రాష్ట్రాలలో, దేశాలలో తెలుగును నేర్పటానికి ఏర్పాట్లు కావాలి. అక్కడ రెండవ అధికార భాషగా తెలుగు కోసం పట్టుబట్టాలి. 9% మహమ్మదీయులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉర్దూను అధికార భాషగా గుర్తించాం. 3% మంది తమిళులు ఉన్న సింగపూరులో తమిళం అధికార భాషగా గుర్తింపు పొందింది. 40% మందిగా తెలుగువారు ఉన్నా తమిళనాట తెలుగుకు అధికార భాష హోదా లేదు.

12. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న తెలుగు పురావస్తు సామగ్రిని సేకరించాలి. ముందుగ అక్కడ ఉన్నప్పుడే డిజిటలైజ్ చేయాలి. తమిళనాడులో అటువంటి సామగ్రిని నాశనం చేస్తున్నారు. అడిగితే మీరు తీసుకొని పొండి అని అంటున్నారు. ఈ పనిని యుద్ధ ప్రాతిపదికన చేయాలి. ఇంకే మాత్రం జాగుచేయరాదు. బుద్ధప్రసాద్ గారు ఇచ్చిన రిపోర్టు మీద వెంబడే చర్య తీసుకోవాలి.

13. అలాగే తెలుగు సంస్కృతి, జానపద కళలు, ఆటల వివరాలను సేకరించాలి. డిజిటలైజ్ చేయాలి.

14. తెలుగు పరిశోధక విద్యార్థులను అంతటా తిప్పి మారుమూలల్లో మామూలు మనుషులు వాడుతున్న తెలుగు మాటలను సేకరించాలి. తెలుగు పాఠ్యపుస్తకాలలో వాటిని వాడాలి. అన్నమయ్య వాడిన మాటలు తెలియని పరిస్థితి ఏర్పడుతున్నదని రవ్వా శ్రీహరి గారు వాపోతున్నారు.

15. కొత్త మాటల అవసరం ప్రతి రోజూ వస్తూనే ఉంటుంది. తమిళనాడులో ఉన్నట్లుగ దీనికి ఒక ఏర్పాటు ఉండాలి. తెలుగు మూలాల నుంచి మనం మాటలను పుట్టించుకోకపోతే తెలుగు పనికి రాని భాష అని మనం అనుకుంటున్నట్లు భావించాల్సి వస్తుంది.

16. తెలుగు వాచకాలలో తెలుగు మాటలను నేర్పాలి. తెలుగు పాఠాలను కొంతగానైన ఉంచాలి. ఇప్పుడు ఇల్లు, బజారు, పొలం దగ్గర మాత్రమే పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు. బడిలో సంస్కురుతం మాటలు మాత్రమే నేర్పుతున్నారు.

17. కంప్యూటర్, ఫోన్, అంతర్జాల భాషగ తెలుగును పెంపొందించాలి. ఇతర రాష్ట్రాల్లో అక్కడి భాషే వినపడుతుంది ఫోన్లలో. తెలుగు పుస్తకాలు ఇంకా అను రాజోక (ఫాంట్) లోనే అచ్చు అవుతున్నాయి. అందువల్ల వీటిని కంప్యూటర్లలో సెర్చ్ ఇంజన్ పట్టుకోలేదు. కాబట్టి తరువాతి తరాలకు ఈ పొత్తాలు కనపడవు. ఇతర భాషలకు ఈ ఇబ్బంది లేదు. అందుకని తెలుగులో మంచి రాజోకలను, పేజిమేకర్ను ప్రభుత్వం చేయించాలి.

18. బ్యాంకులు, అటువంటి ఇతర సంస్థలలో తెలుగు వాడకానికి పట్టుబట్టాలి.

19. వలగూడులో (ఇంటర్నెట్) నిరంతరం పెంచుతున్న వాగమిని (dictionary) ప్రభుత్వం చేపట్టాలి. అది అందరికి అందుబాటులో వుండాలి. మంది ఇస్తున్న సూచనలను ఒక సంఘం పరికిస్తూ సరిఅయిన మార్పులను చేస్తుండాలి.

20. అంగన్ వాడి నుంచే పనికి రాని భాష తెలుగు అని ప్రభుత్వం చెప్పటం మానివేయాలి.

21. అన్ని తెలుగు పత్రికలు, పుస్తకాలు దొరికే, దాచే వలగూడు ఉండాలి. కూచిభొట్ల ఆనంద్ గారు దీనికి కొంత ప్రయత్నం చేస్తున్నారు కాని ఈ పనిని ప్రభుత్వం చేయాలి.