తెలుగు పాటను పాడుకొందాం! తెలుగు మాటను కాపాడుకొందాం!               తెలుగు లోనే మాట్లాడదాం! తెలుగు కోసం కొట్లాడదాం!               ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి చేతలు తలపెట్టవోయ్!
Categories
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిలుపులు పోటీలు

కొట్ల, కార్యాలయాల పేరుపలకలపై తెలుగు కోసం పిలుపు

కొట్ల, దుకాణాల, కార్యాలయాల పేరుపలకలపై తెలుగులో పేర్లు రాయించండి; మెచ్చుకోలు, కానుక పొందండి!

తెలుగు రాష్ట్రాలలోని జిల్లా ముఖ్య పట్టణాలు, నగరాలలో కొట్లు, దుకాణాలు, కార్యాలయాల పేరుపలకలు తెలుగులో వ్రాయించడం కోసం పిలుపు. చట్టబద్ధంగా తెలుగులో ఉండాల్సినవి ఇవి. ఆయా సంస్థల యజమానులతో పేరుపలకలను తెలుగులో పెట్టించగలిగే భాషోద్యమ కార్యకర్తలకు తెలుగు కూటమి తగు పైకం, మెచ్చాంకులతో సత్కరించ తలపెట్టింది.

ఇంత వరకు మనము తెలుగు రచయితలను గౌరవిస్తే తెలుగును కాపాడుకున్నట్లే అనుకున్నాము. సాహితీకారులకు పారితోషికాలు ఇవ్వటం మాత్రమే మనం చేయాల్సినది అనుకున్నాము. కాని ఇది సరిపోదు అని ఆచరణలో తేలింది. దేశం మొత్తం మీద తెలుగు పరిస్థితి నానాటికి తీసికట్టుగ తయారు అవుతున్నది. తల్లి నుడిని కాపాడుకోవటం మన కర్తవ్యం అని సగటు మనిషి ఇక్కడ అనుకోవటం లేదు. జల్లికట్టు ఆడవద్దు అని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇది వారి భాష మీద దాడి కాదు. వారి సంస్కృతిలోని ఒక చిన్న విషయం మీద తీర్పు అది. తమిళులు ఆ న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ వేయలేదు. ముఖ్యమంత్రులను వేయమని స్తోత్ర పాఠాలు చదవలేదు. ఇది అన్యాయం అని సమావేశాలు, తీర్మానాలు కానిస్తూ ఉండలేదు. ఒకే సారి 19 లక్షల మంది బయటకు వచ్చి “మేము ఎడ్ల తోటి రోడ్ల మీద ఆడతాం. బడ్లు ఎవరు మమ్మల్ని ఆపుతారో చూస్తాం”  అన్నారు.

తెలుగు కోసం సగటు మనిషిని ఇక్కడ కదిలిస్తేనే మన నుడి బ్రతుకుతుంది అని నందివెలుగు ముక్తేశ్వర రావు IAS గారు ఈ శనివారం (10-4-17) సాయంత్రం జరిగిన తెలుగు కూటమి రచ్చబండలో అన్నారు. అంతట సగటు మనిషి తెలుగు కోసం ఏమి చేయగలడు అన్న విషయాల మీద చర్చ జరిగింది. “ముందుగా ఒక విషయాన్ని తీసుకొని కదులుదాం, మిగిలిన విషయాలను తరువాత చూద్దాం.” అని నిర్ణయించారు. చివరకు కొట్ల/దుకాణాల/కార్యాలయాల పేరు పలకల మీద తెలుగు ఉండటానికి తెలుగు అభిమానులను కదలమని పిలుపు ఇద్దాం అని నిర్ణయించినారు. ఇది చట్టబద్ధమైన పని. దీనికి సంబంధించిన ప్రభుత్వాదేశాలను మనం సేకరించి అడిగిన వారికి ఇవ్వాలి. కొట్టు యజమాని దగ్గరకు వెళ్లి ఆయనతో, తెలుగును ప్రోత్సహించమని చట్టాలను గౌరవించమని కోరాలి. మొత్తం మీద ఈ పనిలో విజయం సాధించిన వారికి తగు సన్మానం, మెచ్చాంకు (appreciation letter), 5,000 రూపాయల పైకం కాన్క ఇవ్వాలి అని నిర్ణయించారు. వెంటనే చాల మంది ఈ పనిలో ముందుకు సాగుతాము అని తెలియజేశారు. అప్పుడు నరసింహప్ప IRS గారు దీనికి కావలసిన వనరులను సమకూరుస్తాను అన్నారు.

ఈ పని మొదలు పెట్టే వారు ముందుగా 94408 01883/ 95052 98565 తో మాట్లాడాలి. తరువాత ఇక్కడ కింది ఫారంలో తెలియజేయాలి. ముందుగా మనం ఈ పనిని జిల్లా ముఖ్య పట్టణాల నుంచి మొదలు పెడదాం అనుకొన్నాము. తెలుగు కోసం మొదలు పెట్టిన ఈ మొట్ట మొదటి భాషోద్యమ కార్యక్రమాన్ని నిజమైన తెలుగు అభిమానులు అందరూ అందరికి తెలియజేయండి; ప్రోత్సహించండి.

ఈ తెలుగు పేరుపలకల ఉద్యమంలో పాల్గొనడానికి, మీ వివరాలను ఇక్కడ నమోదు చేయండి:

నమోదు ఫారం

%d bloggers like this: